మదనపల్లె,సెప్టెంబర్ 13:రానున్న ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ప్రతి ఒక్కరికీ పార్టీ తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని జనసేన పార్టీ రాయలసీమ కో-కన్వీనర్, మదనపల్లె నియోజకవర్గ ఇన్చార్జ్ గంగారపు రామదాస్ చౌదరి తెలిపారు. ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యే ప్రతి ఒక్కరూ ముందస్తు ప్రణాళికతో, స్పష్టమైన కార్యాచరణతో ముందుకు సాగాలని ఆయన సూచించారు.
పార్టీ కార్యకర్తలు, నాయకులతో నిర్వహించిన సమావేశంలో రామదాస్ చౌదరి ఎన్నికల సన్నద్ధతపై దిశానిర్దేశం చేశారు. ఎన్నికలను కేవలం పోటీగా కాకుండా గెలుపే లక్ష్యంగా తీసుకుని పనిచేయాలని సూచించారు.
ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ తమ పరిధిలోని పరిస్థితులను అధ్యయనం చేసి, ప్రజలతో నిరంతరం మమేకమయ్యేలా కార్యాచరణ రూపొందించుకోవాలని తెలిపారు. ప్రజా సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయడంతో పాటు పార్టీ విధానాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు.
ఖచ్చితమైన ప్రణాళిక.. క్రమబద్ధమైన కార్యాచరణ.. సమష్టి కృషితో ఎన్నికలను ఎదుర్కొంటే విజయాన్ని సాధించేందుకు అవకాశం ఉంటుందని రామదాస్ చౌదరి పేర్కొన్నారు. పార్టీ నాయకత్వం, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ జనసేన బలోపేతానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
