ఉపాధ్యాయులే విద్యార్థుల జీవితాలకు మార్గదర్శకులు.

60మందికి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల ప్రధానం*

పండుగ వాతావరణంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు*

మదనపల్లి , సెప్టెంబర్ 05:

ఉపాధ్యాయులు తరగతి గదిలో పాఠాలు బోధించడానికే పరిమితం కాకుండా విద్యార్థులకు మెంటర్లుగా, మార్గదర్శకులుగా నిలవాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు.

శనివారం మదనపల్లి పట్టణంలోని ఎస్.ఆర్.కె. కన్వెన్షన్ హాలులో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు పండుగ వాతావరణంలో ఘనంగా జరిగాయి.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్
నిశాంత్ కుమార్ తో పాటు మదనపల్లె శాసన సభ్యులు షాజహాన్ బాషా, డీఈవో సుబ్రహ్మణ్యం, సర్వ శిక్ష అభియాన్ ఏడి అనురాధ, ఎంఈఓ లు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు తరగతి గదిలో పాఠాలు బోధించడానికే పరిమితం కాకుండా విద్యార్థులకు మెంటర్లుగా, మార్గదర్శకులుగా నిలవాలన్నారు.

ప్రతి వ్యక్తి జీవితంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమన్నారు. తన జీవితంలోనూ పదో తరగతి నుంచి ఉన్నత విద్య వరకు ఉపాధ్యాయులు అందించిన ప్రోత్సాహం, మార్గదర్శకత్వమే సరైన దిశను చూపించిందని తెలిపారు.విద్యార్థులకు మంచి అలవాట్లు అలవర్చడంతో పాటు సరైన కెరీర్‌ ఎంపికలో మార్గనిర్దేశం చేయాలని సూచించారు.

ఎప్పటికప్పుడు విద్యార్థుల్లో వున్న ప్రతిభను గుర్తించి… వాటిని ఏ విధంగా సమాజానికి ఉపయోగపడుతుందో గుర్తించి ముందుకు నడిపేవారే గురువులు అన్నారు. ఉపాధ్యాయులు సమాజ నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తున్నారన్నారు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న “డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా జరుపుకునే ఉపాధ్యాయ దినోత్సవం ప్రతి ఒక్కరికి ప్రేరణ అవుతుందన్నారు. విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దడమే కాకుండా, బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అమూల్యం” అని అన్నారు. గురువులు విద్యార్థులలో క్రమశిక్షణ, విలువలను నేర్పడం, సమాజంలో ఒడిదుడుకులను ఎలా ఎదుర్కోవాలో నేర్పిస్తారన్నారు.

మద్యం, మాదకద్రవ్యాలు, సోషల్‌ మీడియా దుష్ప్రభావాలు, బైక్‌ రేసింగ్‌, స్టంట్స్‌ వంటి చెడు అలవాట్లకు విద్యార్థులు గురికాకుండా ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలన్నారు.

‘మై స్కూల్‌ – మై ప్రైడ్‌’ కార్యక్రమం ద్వారా విద్యార్థుల విద్యతో పాటు వ్యక్తిత్వ వికాసానికి కృషి చేయాలని సూచించారు.
తన జీవితంలో మార్గదర్శకత్వం అందించిన ఉపాధ్యాయులు, మెంటర్లకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని జిల్లా కలెక్టర్ పేర్కొంటూ, ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ.

ఉపాధ్యాయ దినోత్సవం కేవలం టీచర్స్ డే మాత్రమే కాదని, దేశ నిర్మాణ దినోత్సవంగా భావించాలని మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా అన్నారు.

ఉపాధ్యాయులే విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్ది, మంచి సమాజ నిర్మాణానికి పునాదులు వేస్తారని తెలిపారు. పాఠశాల స్థాయిలో విద్యార్థులకు నేర్పే క్రమశిక్షణ, నడవడిక, మర్యాద, బాధ్యత, మంచి అలవాట్లు జీవితాంతం వారితో ఉంటాయని పేర్కొన్నారు.

తల్లిదండ్రులు, గురువులను గౌరవించే వారు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారని అన్నారు. దేశ ప్రధానమంత్రి నుంచి గ్రామ సర్పంచ్ వరకు ప్రతి ఒక్కరి విజయం వెనుక ఒక ఉపాధ్యాయుడి కృషి ఉంటుందని తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించేందుకు ఉపాధ్యాయులు మరింత బాధ్యతతో పనిచేయాలని, విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు కృషి చేయాలని సూచించారు.

మదనపల్లె విద్యా రంగానికి ప్రత్యేక గుర్తింపు కలిగిన ప్రాంతమని, శతాబ్దానికి పైగా చరిత్ర కలిగిన జెడ్పీ హైస్కూల్‌, బీటీ కళాశాల వంటి విద్యాసంస్థలు ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాయని చెప్పారు.

పాఠశాలలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు పూర్తి సహకారం అందిస్తారని తెలిపారు.

విద్యావంతుల సంఖ్య పెరిగినప్పుడే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా పేర్కొన్నారు.ఈ సందర్భంగా జిల్లాలోని ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం అతిధులు 60 మంది ఉపాధ్యాయులను పేరుపేరునా ఆత్మీయంగా పలకరిస్తూ ఘనంగా సన్మానం చేశారు.

అంతకుముందు పీపుల్స్ స్కూల్ బి కొత్తకోట,చైతన్య ఆశ్రమం మదనపల్లి,ఆర్ బి డ్యాన్స్ స్టూడియో మదనపల్లి,గీతా వాణి స్కూల్ మదనపల్లి,జడ్పీ హైస్కూల్ బసినికొండ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

ఈ కార్యక్రమంలో డీఈఓ కె.సుబ్రహ్మణ్యం,సర్వ శిక్ష అభియాన్ ఏడి అనురాధ, డిప్యూటీ డిఈఓలు, మండల విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయ సంఘ నేతలు, ఉపాధ్యాయులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *