12వ పీఆర్సీ అమలు చేయాలి.. వెంటనే ఐఆర్ ప్రకటించాలి: ఏపీ జేఏసీ
మదనపల్లె: సెప్టెంబర్ 3: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏపీ జేఏసీ అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.ఎం. బాబి డిమాండ్ చేశారు. గురువారం స్థానిక కలెక్టరేట్, సబ్‌కలెక్టరేట్ వద్ద ఏపీ జేఏసీ నాయకులు భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏపీ జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. 12వ పీఆర్సీ కమిషన్‌ను నియమించి, అమలు చేయాలని, ఉద్యోగులకు మధ్యంతర భృతి (ఐఆర్)ను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్న 29 ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం పరిశీలించి పరిష్కరించాలని నాయకులు కోరారు. తమ డిమాండ్ల సాధన కోసం ఈ నెల 26వ తేదీ వరకు దశలవారీగా ఉద్యమాలు, వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.
అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే సహాయ నిరాకరణ, రిలే నిరాహార దీక్షలు, ఛలో విజయవాడ వంటి తదుపరి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఏపీ జేఏసీ నాయకులు హెచ్చరించారు.
అనంతరం కలెక్టరేట్లో జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) వెంకటేశుకు ఏపీ జేఏసీ నాయకులు వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమాల్లో ఏపీ జేఏసీ నాయకులు నిర్మల, గురుప్రసాద్, శేషాద్రిరావు, ఇమ్రాన్, కుమారి, భార్గవి, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
