మాజీ సైనికులకు రెవెన్యూ అధికారులు న్యాయం చేయాలి: జనసేన నాయకుడు గంగారపు రామదాస్ చౌదరి


మదనపల్లె, జూలై 26 (పత్రికా ప్రకటన):
దేశ రక్షణ కోసం ఎండ, వాన, మంచు లెక్కచేయకుండా సరిహద్దుల్లో విధులు నిర్వహించిన మాజీ సైనికుల పట్ల అన్నమయ్య జిల్లా రెవెన్యూ అధికారులు న్యాయంగా వ్యవహరించాలని జనసేన పార్టీ రాయలసీమ కో-కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి కోరారు.
ఆదివారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, మదనపల్లె ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న 0.06 సెంట్ల స్థలం విషయంలో మాజీ సైనికుల సంఘం మరియు రెవెన్యూ శాఖ మధ్య ఎన్నో సంవత్సరాలుగా వివాదం కొనసాగుతోందని తెలిపారు.
ఈ వ్యవహారాన్ని గౌరవ సుప్రీం కోర్టు సూచనల మేరకు చిత్తూరు జిల్లా కోర్టు పరిధిలోని లోక్ అదాలత్‌కు పంపించి, ఇరు వర్గాలు పరస్పర రాజీ ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించినప్పటికీ, ఇప్పటివరకు రెవెన్యూ అధికారులు సానుకూలంగా ముందుకు రాకపోవడం విచారకరమని ఆయన పేర్కొన్నారు.
కోర్టు సూచనలు ఉన్నప్పటికీ సమస్య పరిష్కారానికి రెవెన్యూ శాఖ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. మాజీ సైనికులు దేశానికి అందించిన సేవలను దృష్టిలో ఉంచుకుని, వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే దిశగా అధికారులు స్పందించాలని కోరారు.
మదనపల్లె డివిజన్ మాజీ సైనికుల సంఘం అధ్యక్షుడు కంచర్ల శ్రీనివాసులు నాయుడుతో రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే చర్చలు జరిపి, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని గంగారపు రామదాస్ చౌదరి డిమాండ్ చేశారు. మాజీ సైనికుల పట్ల గౌరవం చూపుతూ వారి న్యాయమైన అభ్యర్థనలను వెంటనే నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *