మాతృభాషలో విద్యతో విద్యార్థుల్లో సృజనాత్మకత పెరుగుతుంది
ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం
మదనపల్లె, ఆగస్టు 29: (gtvmedia)తెలుగు భాష కమ్మదనం, మాధుర్యం, విశిష్టతను మాటల్లో పూర్తిగా వర్ణించలేమని స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కె. బ్రహ్మచారి అన్నారు.
గిడుగు వెంకట రామమూర్తి జయంతిని పురస్కరించుకుని శనివారం స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కె. బ్రహ్మచారి, వైస్ ప్రిన్సిపాల్ బి. లలితాబాయి పాల్గొని తెలుగు భాష ప్రాధాన్యతను వివరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిడుగు వెంకట రామమూర్తి తెలుగు భాషను గ్రాంథిక భాష నుంచి వ్యవహారిక భాష వైపు తీసుకురావడంలో చేసిన కృషిని వివరించారు. గ్రాంథిక, వ్యవహారిక భాషల మధ్య ఉన్న వ్యత్యాసాలను విద్యార్థులకు తెలియజేస్తూ, నేటి సమాజంలో తెలుగు భాష పరిరక్షణ, ప్రాధాన్యత గురించి అవగాహన కల్పించారు.
ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులకు మాతృభాషలో విద్యను అందిస్తే వారి సృజనాత్మకత పెరగడంతో పాటు భాషపై మంచి పట్టు ఏర్పడుతుందని ప్రిన్సిపాల్ కె. బ్రహ్మచారి పేర్కొన్నారు. తెలుగు భాషను భావితరాలకు అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.
అనంతరం వివిధ కార్యక్రమాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
