మిట్స్‌లో “ఇండస్ట్రీ-రెడీ డెవ్ఒప్స్”పై అవగాహన వర్క్‌షాప్

పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించుకోవాలి: నిపుణులు

మదనపల్లె: (gtvmedia)పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులు ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని పరిశ్రమ నిపుణులు సూచించారు. మదనపల్లె సమీపంలోని మదనపల్లె ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (మిట్స్) డీమ్డ్ టు బీ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (సైబర్ సెక్యూరిటీ) విభాగం, మిట్స్ ఐఈఈఈ ఆధ్వర్యంలో ఇండస్ట్రీరెడీ డెవ్ఒప్స్: ఫ్రమ్ కోడ్ టు డిప్లాయ్‌మెంట్ అంశంపై అవగాహన వర్క్‌షాప్ నిర్వహించారు.

కార్యక్రమానికి బెంగళూరుకు చెందిన ఫెడిలిటీ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ సైట్ రిలయబిలిటీ ఇంజనీర్ లీడ్ రంజన్ బిస్వాల్, మార్కెటింగ్ బ్రాండ్ కన్సల్టెంట్, ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్ పంకజ్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పంకజ్ కుమార్ మాట్లాడుతూ.. ఆధునిక ఐటీ పరిశ్రమలో సాఫ్ట్‌వేర్ అభివృద్ధి నుంచి అప్లికేషన్‌ను తుది వినియోగంలోకి తీసుకురావడం వరకు డెవ్ఒప్స్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. సాంకేతిక రంగంలో వేగంగా వస్తున్న మార్పులను విద్యార్థులు నిరంతరం అధ్యయనం చేస్తూ, పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.

కోడ్ అభివృద్ధి నుంచి అప్లికేషన్‌ను క్లౌడ్‌లో డిప్లాయ్ చేయడం వరకు జరిగే ప్రక్రియను విద్యార్థులకు నిపుణులు వివరించారు. డేటా సెక్యూరిటీ, బ్యాకప్, ఆటోమేషన్, తక్కువ వ్యయంతో అధిక సామర్థ్యం, వేగవంతమైన సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, డిప్లాయ్‌మెంట్ వంటి అంశాలపై అవగాహన కల్పించారు.

వర్క్‌షాప్‌లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS), డెవ్ఒప్స్ టూల్స్, ఆటోమేషన్, సెక్యూరిటీ, సిస్టమ్ ఇంటిగ్రేషన్, క్లౌడ్ ఆధారిత అప్లికేషన్ డెవలప్‌మెంట్, డిప్లాయ్‌మెంట్, మానిటరింగ్ వంటి అంశాలపై ప్రాక్టికల్ సెషన్లు నిర్వహించారు.

డెవ్ఒప్స్‌తో పాటు AWS, మైక్రోసాఫ్ట్ అజూర్, గూగుల్ క్లౌడ్ వంటి ఆధునిక క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్‌లపై నైపుణ్యాలను పెంపొందించుకుంటే ఐటీ రంగంలోని విస్తృత ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని నిపుణులు తెలిపారు. ప్రాక్టికల్ పరిజ్ఞానం, క్లౌడ్ టెక్నాలజీలపై అవగాహన, ఆటోమేషన్ నైపుణ్యాలు భవిష్యత్ ఉద్యోగ అవకాశాలకు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు.

కార్యక్రమంలో డీన్–స్కూల్ ఆఫ్ కంప్యూటింగ్ డాక్టర్ చంద్ర ప్రకాష్ గుప్తా, కోఆర్డినేటర్ డాక్టర్ సచికంట దాస్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *