నేరాల నివారణ, రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టి
అన్నమయ్య జిల్లా, మదనపల్లె, ఆగస్టు 28: (gtvmedia)నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు రోడ్డు ప్రమాదాల నివారణకు అన్నమయ్య జిల్లా పోలీసులు రాత్రివేళల్లో ప్రత్యేక నిఘా, గస్తీని ముమ్మరం చేశారు.
జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, ఐపీఎస్ ఆదేశాల మేరకు పోలీసులు ప్రతిరోజూ రాత్రి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అనుమానిత వ్యక్తుల కదలికలపై నిఘా పెట్టడంతో పాటు వాహనాల తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేపడుతున్నారు.
రాత్రివేళల్లో వాహనదారులు సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకునేలా “పేస్ వాష్ అండ్ గో” కార్యక్రమాన్ని కూడా పోలీసులు నిర్వహిస్తున్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపేవారిని గుర్తించడంతో పాటు రోడ్డు భద్రతపై వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు.
అనుమానాస్పదంగా రాత్రివేళల్లో సంచరించే వ్యక్తుల వివరాలను పరిశీలిస్తూ వారి వేలిముద్రలను సేకరిస్తున్నారు. జిల్లా సరిహద్దులతో పాటు ఏటీఎంలు, దేవాలయాలు, నివాస ప్రాంతాల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా రాత్రివేళల్లో పోలీసుల నిఘా, గస్తీ నిరంతరం కొనసాగుతుందని పోలీసు అధికారులు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపించినట్లయితే వెంటనే డయల్-100 లేదా 112కు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు.
