ఇన్‌ సర్వీస్‌ టీచర్లను ఆందోళనకు గురిచేయడం తగదు

టెట్‌ నుంచి సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులకు పూర్తిగా మినహాయింపు ఇవ్వాలి

మదనపల్లె, ఆగస్టు 27:( gtvmedia)సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులను టెట్‌ విషయంలో తీవ్ర మనోవేదనకు గురిచేయడం తగదని, వారిని టెట్‌ నుంచి పూర్తిగా మినహాయించేలా విద్యా హక్కు చట్టంలో సవరణ చేయాలని ఎస్‌టీయూ అన్నమయ్య జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అంకం శివారెడ్డి, పోకల మధుసూదన డిమాండ్‌ చేశారు.

రాష్ట్ర సంఘం పిలుపు మేరకు గురువారం సాయంత్రం కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ఎస్‌టీయూ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సుమారు 25 లక్షల మంది ఉపాధ్యాయులను ఆందోళనకు గురిచేస్తున్న టెట్‌ నిబంధనల నుంచి ఇప్పటికే సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులకు పూర్తిస్థాయిలో మినహాయింపు కల్పించాలని కోరారు.

ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అనేకసార్లు ప్రాతినిధ్యాలు చేసినప్పటికీ పార్లమెంటులో చట్ట సవరణ చేయకపోవడం దారుణమన్నారు. విద్యా హక్కు చట్టంలోని 23(1) నిబంధనను సవరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంతో పాటు, వెంటనే అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్‌ చేశారు.

ఇటీవల నిర్వహించిన టెట్‌లో పలువురు సీనియర్‌ ఉపాధ్యాయులు ఆన్‌లైన్‌ పరీక్షా విధానంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన స్పెషల్‌ టెట్‌ నోటిఫికేషన్‌లోనూ ఎలాంటి మార్పులు చేయకపోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.

సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్‌లో కామన్‌గా 40 శాతం ఉత్తీర్ణత మార్కులను నిర్ణయించి, ఆఫ్‌లైన్‌ విధానంలో పరీక్ష నిర్వహించాలని కోరారు. ఉపాధ్యాయులు ప్రస్తుతం బోధిస్తున్న సబ్జెక్టుకు సంబంధించిన సిలబస్‌కే పరీక్షను పరిమితం చేయాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

ఉపాధ్యాయులపై అదనపు ఒత్తిడి లేకుండా ప్రభుత్వం తక్షణమే సమస్యను పరిష్కరించాలని, లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో కడియాల మురళి, అయూబ్, రాజారెడ్డి, నరసింహులు, శ్రీనాథ్, శ్రీనివాసులు, రమాదేవి, కుసుమ, సైరాభాను, సుశీల, అశోక్, రెడ్డప్పరెడ్డి, సుబ్బారెడ్డి, అమరనాథ్‌రెడ్డి, మోహన్, హరీష్, సుకూర్, నరసింహారెడ్డి, శేఖర్‌రెడ్డి, గోపాల్, నాగమోహన్‌రెడ్డి, శివకుమార్, రవీంద్రనాథ్‌రెడ్డి, సుధాకర్, అక్బర్, శాషాద్రి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *