ప్రెస్‌క్లబ్‌లో బాధితుడు రాజప్ప వేడుకోలు
మదనపల్లె, ఆగస్టు 26: (gtvmedia)వ్యక్తిగత కక్షలతో కళావతమ్మ తనను తీవ్రంగా వేధింపులకు గురిచేస్తోందని రామసముద్రం మండలం గజ్జలవారిపల్లికి చెందిన రాజప్ప ఆవేదన వ్యక్తం చేశారు. తనకు రక్షణ కల్పించి, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు. ఈ మేరకు బుధవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన తన ఆవేదనను వెల్లడించారు.
రాజప్ప మాట్లాడుతూ.. వీరభద్ర భార్య కళావతమ్మ వద్ద తాను ఒక్క ఆవును కూడా పాలికి తోలుకోలేదని స్పష్టం చేశారు. తనను అభాసుపాలు చేసేందుకే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. తన నాలుగు ఆవులను రాజప్ప పాలికి తీసుకెళ్లి తిరిగి ఇవ్వలేదంటూ కళావతమ్మ కలెక్టరేట్ వద్ద నిరాహార దీక్ష చేపట్టడం వాస్తవ విరుద్ధమని అన్నారు.
తనపై చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని, వాస్తవాలను నిరూపించేందుకు ఎక్కడైనా ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నానని రాజప్ప తెలిపారు. కళావతమ్మ, ఆమె కుటుంబ సభ్యులు కూడా ప్రమాణం చేసి వాస్తవాలు వెల్లడించాలని కోరారు. అసత్య ఆరోపణలతో తనను మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ వ్యవహారంపై గతంలో కళావతమ్మ అధికారులకు ఫిర్యాదు చేయగా, అధికారులు విచారణ జరిపి ఆరోపణలు నిరాధారమైనవిగా తేల్చారని రాజప్ప పేర్కొన్నారు. కొద్దిరోజుల పాటు మౌనంగా ఉన్న కళావతమ్మ ప్రస్తుతం మళ్లీ తనను వేధింపులకు గురిచేస్తోందని ఆరోపించారు. అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తానంటూ బెదిరిస్తున్నారని వాపోయారు.
ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు సమగ్రంగా విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు తనకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని రాజప్ప విజ్ఞప్తి చేశారు.
