పాలక, ప్రతిపక్షాల నిర్లక్ష్యమే మదనపల్లెకు నీటి కష్టాలు

చిప్పిలి, బండకాడపల్లి సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకుల పనులు పూర్తి చేయాలి

ప్రభుత్వంపై కూటమి నాయకులు ఒత్తిడి తేవాలి: కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు ఎస్. రెడ్డీ సాహెబ్‌

మదనపల్లె, ఆగస్టు 26:( gtvmedia)మదనపల్లె ప్రజల దాహార్తిని శాశ్వతంగా తీర్చేందుకు చేపట్టిన చిప్పిలి, బండకాడపల్లి సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకుల నిర్మాణ పనులు పూర్తికాకపోవడమే ప్రస్తుత నీటి సమస్యలకు ప్రధాన కారణమని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు ఎస్. రెడ్డీ సాహెబ్‌ ఆరోపించారు.

బుధవారం మదనపల్లెలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో 2007లో మదనపల్లె ప్రజలకు శాశ్వత తాగునీటి పరిష్కారం కల్పించాలనే లక్ష్యంతో సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకుల నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు.

హంద్రీ–నీవా ద్వారా కృష్ణా జలాలను తీసుకువచ్చి చిప్పిలి సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకులో నిల్వ చేసి, అవసరమైన సమయంలో మదనపల్లె ప్రజలకు తాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును రూపొందించారని చెప్పారు. అయితే ఏళ్లు గడుస్తున్నా ప్రాజెక్టులోని కీలకమైన పనులు పూర్తికాకపోవడం పాలకుల చిత్తశుద్ధికి నిదర్శనమని విమర్శించారు.

ట్యాంక్‌ నిర్మాణంతో పాటు నీటి నిల్వకు సంబంధించిన మొరవ, స్పిల్‌వే, కాలువల అనుసంధానం వంటి కీలక పనులు పూర్తికాకపోవడంతో మదనపల్లెకు నీటి సరఫరా కోసం ఏర్పాటు చేసిన వాటర్‌ ప్లాంట్‌ కూడా ఆశించిన స్థాయిలో ఉపయోగపడటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 2019 వరకు జరిగిన పనులు మినహా ఆ తర్వాత ప్రాజెక్టు విషయంలో చెప్పుకోదగిన పురోగతి కనిపించలేదని ఆరోపించారు.

ప్రస్తుతం మదనపల్లె ప్రాంతంలో కరువు పరిస్థితులు తీవ్రంగా ఉండటంతో ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇలాంటి సమయంలో శాశ్వత తాగునీటి పరిష్కారం చూపాల్సిన సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోవడం బాధాకరమన్నారు.

కూటమి ప్రభుత్వం, గత వైసీపీ ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగానే ప్రాజెక్టు పనులు పూర్తికాలేదని ఎస్. రెడ్డీ సాహెబ్‌ విమర్శించారు. ఇప్పటికైనా కూటమి నాయకులు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి చిప్పిలి, బండకాడపల్లి సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకుల పనులను పూర్తి చేయించి, మదనపల్లె ప్రజల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *