మిట్స్‌ను సందర్శించిన అమెరికా విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు

సాంకేతిక నైపుణ్యాలతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్‌ను పెంపొందించుకోవాలి

మదనపల్లె, ఆగస్టు 24: (gtvmedia)మదనపల్లె సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీని అమెరికాకు చెందిన ప్రముఖ విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు సందర్శించారు. అమెరికాలోని సోనోమా స్టేట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ ఫరీద్ ఫరాహ్మంద్, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, శాన్ డియాగో ఎక్స్‌టెన్షన్ ప్రొఫెసర్ శివకుమార్ మాతపతి మిట్స్‌లోని విద్యా, పరిశోధన సదుపాయాలను పరిశీలించారు.

యూనివర్సిటీలోని అత్యాధునిక ప్రయోగశాలలు, మౌలిక సదుపాయాలు, లైబ్రరీ, సాంకేతిక పరికరాలు, డిజిటల్ వ్యవస్థలు, విద్యార్థులకు అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక వనరులను పరిశీలించిన ప్రొఫెసర్లు మిట్స్ ఫౌండర్, ఛాన్సలర్ డాక్టర్ యెన్. విజయ భాస్కర్ చౌదరిని అభినందించారు.

అనంతరం విద్యార్థులతో నిర్వహించిన ఇంటరాక్షన్ సెషన్‌లో డాక్టర్ ఫరీద్ ఫరాహ్మంద్ మాట్లాడుతూ, సాంకేతిక పరిజ్ఞానం వేగంగా మారుతున్న నేపథ్యంలో విద్యార్థులు కొత్త టెక్నాలజీలను నిరంతరం నేర్చుకోవడంతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్, సమస్య పరిష్కార నైపుణ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు.

IoT, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అప్లైడ్ రీసెర్చ్ వంటి ఆధునిక రంగాల్లో ప్రాజెక్టులు, పరిశోధనలు చేపట్టేందుకు సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoEs) కీలక వేదికలుగా ఉపయోగపడతాయని తెలిపారు. యూనివర్సిటీ అందిస్తున్న అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ప్రొఫెసర్ శివకుమార్ మాతపతి మాట్లాడుతూ, ఆధునిక సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా ఇంజినీరింగ్ విద్యార్థులకు ప్రాథమిక అంశాలపై బలమైన పట్టు అత్యంత ముఖ్యమన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు కమ్యూనికేషన్, టీమ్‌వర్క్, సమస్య పరిష్కారం, నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.

ల్యాబ్‌లు, ప్రాజెక్టులు, ఇన్నోవేషన్ కార్యక్రమాలు, పరిశోధన, ఇతర ప్రాక్టికల్ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనడం ద్వారా విద్యార్థులు తమ నైపుణ్యాలను మెరుగుపరచుకోవచ్చని తెలిపారు. అధ్యాపకులు, పరిశ్రమ నిపుణులతో కలిసి పనిచేయడంతో పాటు అంతర్జాతీయ సహకారాలు, పరిశోధన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో టీసీఎస్ మాజీ కన్సల్టెంట్ డాక్టర్ శ్రీశైల్ అంగడి, మిట్స్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ టి.జి. రవికుమార్, అసోసియేట్ డైరెక్టర్–ఇంటర్నేషనల్ రిలేషన్స్ యూ. విజయలక్ష్మి, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *