కరువు సహాయక చర్యలు చేపట్టి కూలీలకు పని కల్పించాలి

మదనపల్లె, ఆగస్టు 24: (gtvmedia)వలసల నివారణకు తక్షణమే కరువు సహాయక చర్యలు చేపట్టి వ్యవసాయ కూలీలకు పని కల్పించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం (బీకేఎంయూ) డిమాండ్ చేసింది.

సంఘం రాష్ట్ర సమితి పిలుపు మేరకు సోమవారం అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. పేదలకు సామాజిక న్యాయం, ఆత్మగౌరవం కల్పించాలని నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి తోపు కృష్ణప్ప మాట్లాడుతూ కరువు పరిస్థితుల నేపథ్యంలో కూలీలకు తక్షణ ఉపాధి కల్పించాలని, ప్రతి కుటుంబానికి ఉచితంగా 50 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులు అందించాలని కోరారు. కరువు పెన్షన్‌గా ప్రతి కుటుంబానికి రూ.10 వేలు ఇవ్వాలని, పేదలకు ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు.

అలాగే గిరిజనులకు అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయాలని, వ్యవసాయ కూలీలు, దళితులు, గిరిజనులకు భూ పంపిణీ చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఎం.సాంబశివ, సీపీఐ పట్టణ కార్యదర్శి మాధవకుమార్, మల్లికార్జున, సిద్ధయ్య, ఉమా, మునిరత్నం నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *