4 సవర్ల బంగారం సహా బాధితురాలికి అప్పగింత
తిరుపతి, ఆగస్టు 26: (gtvmedia)నాయుడుపేట బస్టాండ్‌లో మర్చిపోయిన విలువైన బ్యాగును సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించి, అందులోని సుమారు నాలుగు సవర్ల బంగారు ఆభరణాలు, నగదు, సెల్‌ఫోన్‌తో సహా బాధితురాలికి సురక్షితంగా అప్పగించి నాయుడుపేట పోలీసులు సమర్థత చాటుకున్నారు.
నాయుడుపేటకు చెందిన గువ్వల దేవి బుధవారం మధ్యాహ్నం సుమారు 1 గంట సమయంలో బస్టాండ్‌లో తన బ్యాగును మర్చిపోయి బస్సులో ప్రయాణిస్తూ వెళ్లిపోయారు. కొంతసేపటి తర్వాత బ్యాగు బస్టాండ్‌లోనే మర్చిపోయిన విషయం గుర్తించిన ఆమె వెంటనే నాయుడుపేట పోలీసులను ఆశ్రయించారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే బస్టాండ్‌లోని సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించారు. ఫుటేజ్ ఆధారంగా బాధితురాలు ప్రయాణించిన బస్సు నెల్లూరు వైపు వెళ్తున్నట్లు గుర్తించి, అక్కడి క్రైమ్ పార్టీ సిబ్బందిని అప్రమత్తం చేశారు.
నెల్లూరు క్రైమ్ పార్టీ సిబ్బంది సమన్వయంతో బస్సును ట్రాక్ చేసి, అందులో ప్రయాణిస్తున్న దాసూరు మిత్తమ్మ, చుచ్చు జ్యోతి అనే ఇద్దరు మహిళలను గుర్తించారు. వీరు పొదలకూరు మండలం తోడేరు గ్రామానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు.
వారి వద్ద ఉన్న బ్యాగును స్వాధీనం చేసుకుని పరిశీలించగా అందులో గాజులు, నెక్లెస్, చెవి కమ్మలు కలిపి సుమారు నాలుగు సవర్ల బంగారు ఆభరణాలు, రూ.1,000 నగదు, సెల్‌ఫోన్‌తో పాటు ఇతర వస్తువులు ఉన్నట్లు గుర్తించారు.
అనంతరం బ్యాగును నాయుడుపేట పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి, అందులోని వస్తువులను ధృవీకరించిన తర్వాత బాధితురాలు గువ్వల దేవికి సురక్షితంగా అప్పగించారు. విలువైన వస్తువులు తిరిగి లభించడంతో ఆమె పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
పోలీసుల పనితీరును అభినందించిన ఎస్పీ
ఈ ఘటనలో తక్షణమే స్పందించి సీసీ కెమెరాల ఫుటేజ్‌ను సమర్థవంతంగా వినియోగించడం, బస్సు కదలికలను గుర్తించడం, నెల్లూరు క్రైమ్ పార్టీ సిబ్బందితో సమన్వయం చేసుకోవడం ద్వారా బ్యాగును సురక్షితంగా స్వాధీనం చేసుకున్న ఎస్‌ఐ ఎం. శివశంకరరావు, హెడ్ కానిస్టేబుల్ రాజు, కానిస్టేబుళ్లు చిరంజీవి, పోలయ్యలను జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్ అభినందించారు.
ప్రజలు విలువైన వస్తువులు పోగొట్టుకున్న సందర్భాల్లో పోలీసులు తక్షణమే స్పందిస్తూ, అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వాటిని గుర్తించి బాధితులకు అందజేయడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని ఎస్పీ తెలిపారు. ప్రజల భద్రత, సంక్షేమం కోసం పోలీస్ శాఖ ఎల్లప్పుడూ బాధ్యతాయుతంగా పనిచేస్తుందని పేర్కొన్నారు.
