రాజంపేట పార్లమెంట్ టీడీపీ క్యాడర్ సమావేశం.. స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపు

మదనపల్లె, జూలై 29: (gtvmedia)స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేయాలని రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు పిలుపునిచ్చారు. మదనపల్లె దేవతనగర్‌లోని రాజంపేట పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన నెలవారీ క్యాడర్ సమావేశంలో ఆయన మాట్లాడారు.

పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మార్గదర్శకత్వంలో పార్టీని గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేయడం, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడం లక్ష్యంగా ఈ సమావేశం నిర్వహించినట్లు నాయకులు తెలిపారు.

సమావేశానికి రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు అధ్యక్షత వహించగా, మదనపల్లె ఎమ్మెల్యే ఎం. షాజహాన్ బాషా, పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పఠాన్ ఖాదర్ ఖాన్, పార్లమెంట్ కమిటీ సభ్యులు, అసెంబ్లీ స్థాయి నాయకులు, మండల అధ్యక్షులు, అనుబంధ విభాగాల ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎం. షాజహాన్ బాషా మాట్లాడుతూ, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ‘డోర్-టు-డోర్ – ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమాన్ని విజయవంతం చేసి స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు మాట్లాడుతూ, కార్యకర్తలే పార్టీకి బలమని పేర్కొన్నారు. జూలై 27 నుంచి కొనసాగుతున్న ‘డోర్-టు-డోర్ – ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమాన్ని ప్రతి గ్రామం, ప్రతి వార్డు, ప్రతి ఇంటికి తీసుకెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *