మదనపల్లె:
ప్రభుత్వ పాఠశాలల్లో శుక్రవారం నిర్వహించనున్న ‘మెగా పీటీఎం–4.0’ కార్యక్రమాన్ని జిల్లావ్యాప్తంగా విజయవంతం చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులను కోరారు. ఉదయం 9 గంటల నుంచే అన్ని బడుల్లో సమావేశాలు ప్రారంభమవుతాయని, అందుకు తగ్గట్లుగా ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు.
పాఠశాలల యాజమాన్య కమిటీ (SMC) సభ్యులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులందరూ ఈ సమావేశానికి తప్పకుండా హాజరయ్యేలా చూడాలన్నారు. పిల్లల చదువు, వారి రోజువారీ హాజరు, బడి అభివృద్ధికి చేపడుతున్న పనులతో పాటు ప్రభుత్వ విద్యా పథకాల అమలుపై తల్లిదండ్రులకు స్పష్టంగా వివరించాలన్నారు.
బడి పురోగతి కోసం తల్లిదండ్రులు ఇచ్చే సలహాలు, సూచనలను స్వీకరించి, వారితో కలిసి నిర్ణయాలు తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు రాకుండా కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించాలని డీఈఓ స్పష్టం చేశారు.

