మదనపల్లె సమీపంలో గల (మదనపల్లె ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్) మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీలో ఐఈఈఈ స్టూడెంట్ బ్రాంచ్ మరియు ఐఈఈఈ ఉమెన్ ఇన్ ఇంజినీరింగ్ (WIE) అఫినిటీ గ్రూప్, హైదరాబాద్ సెక్షన్ వారి సంయుక్త ఆధ్వర్యంలో నవంబర్ 24, 2026న “WIE అనంతపురం జోనల్ కాంగ్రెస్–2026” అనే అంశంపై ఒకరోజు జాతీయ స్థాయి సాంకేతిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన అధికారిక పోస్టర్‌ను యూనివర్సిటీ వైస్ ఛాన్సల్లర్ డాక్టర్. సి. యువరాజ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ డాక్టర్. సి. యువరాజ్ మాట్లాడుతూ, ప్రస్తుత సాంకేతిక యుగంలో ఇంజినీరింగ్ రంగంలో మహిళల పాత్ర ఎంతో కీలకమని, సాంకేతిక ఆవిష్కరణలు, పరిశోధన, అభివృద్ధి మరియు నాయకత్వ రంగాల్లో మహిళలు విశేషమైన ప్రతిభను కనబరుస్తున్నారని తెలిపారు. మహిళా విద్యార్థినులు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడంతో పాటు, నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టి, ఆత్మవిశ్వాసంతో ఇంజినీరింగ్ రంగంలో ఉన్నత ఉన్నత స్థాయికి ఎదగాలని అన్నారు. మహిళలకు సమాన అవకాశాలు, ప్రోత్సాహం కల్పించడం ద్వారా సాంకేతిక రంగంలో మరిన్ని విజయాలు సాధించవచ్చని, ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థినుల్లో సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు, సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించేందుకు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థినుల్లో సాంకేతిక పరిజ్ఞానం, కొత్త ఆలోచనలు, మాట్లాడే నైపుణ్యాలను పెంపొందించేందుకు పలు పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్, కన్వీనర్ డాక్టర్ జి నాగ శ్వేత, కోఆర్డినేటర్ డాక్టర్ సోము విజయ భాస్కర్ లు పాల్గొన్నారు.
మిట్స్‌లో “డబ్ల్యూఐఈ అనంతపురం జోనల్ కాంగ్రెస్–2026” పోస్టర్ ఆవిష్కరణ.
