మదనపల్లెలో జైలు భరో.. 35 మంది అరెస్ట్

కలెక్టరేట్ ముట్టడికి యత్నించిన రైతు, కార్మిక సంఘాల నేతలు

మదనపల్లె, ఆగస్టు 10:( gtvmedia)సంయుక్త కిసాన్ మోర్చా, జాతీయ కార్మిక సంఘాల పిలుపు మేరకు దేశవ్యాప్త జైలు భరో కార్యక్రమంలో భాగంగా మదనపల్లెలో రైతు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద పికెటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా 35 మంది రైతు, కార్మిక సంఘాల నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.

మిషన్ కాంపౌండ్ నుంచి ప్రదర్శనగా బయలుదేరిన రైతు, కార్మిక సంఘాల నాయకులు కలెక్టరేట్ వైపు నినాదాలు చేస్తూ చేరుకున్నారు. కార్మికులకు కనీస వేతనం రూ.31 వేలు ఇవ్వాలని, నాలుగు కార్మిక కోడ్‌లను రద్దు చేయాలని, రైతుల ఆదాయం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని, వ్యవసాయ కూలీలకు 200 రోజుల పని కల్పించి రోజుకు రూ.700 వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

కలెక్టరేట్ వద్ద పికెటింగ్ నిర్వహిస్తున్న రైతు, కార్మిక సంఘాల నాయకులను వన్‌టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిలో రైతు సంఘం రాష్ట్ర నాయకులు డా. టి. జనార్దన్, బీకేయంయూ జిల్లా అధ్యక్షుడు కృష్ణప్ప, ఏఐటీయూసీ నాయకుడు మనోహర్ రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు హరి శర్మ, అంగన్వాడీ టీచర్స్ కార్యదర్శి గంగాదేవి తదితరులు ఉన్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు విధానాలను వ్యతిరేకించారు. కార్మికులకు కనీస వేతనాలు, రైతులకు గిట్టుబాటు ధర, వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

అనంతరం అరెస్టు చేసిన కార్మిక, రైతు సంఘాల నాయకులను పోలీసులు సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *