మదనపల్లెకు హంద్రీ–నీవా జలాలు.. తాగునీటికే తొలి ప్రాధాన్యం

చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

మదనపల్లె, సెప్టెంబర్ 07: మదనపల్లె పట్టణ తాగునీటి అవసరాలకు హంద్రీ–నీవా సుజల స్రవంతి (HNSS) నీటిని సమర్థవంతంగా వినియోగించేందుకు అధికారులు సమన్వయంతో ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు.

మదనపల్లె పరిధిలోని చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌ను సోమవారం పరిశీలించిన కలెక్టర్.. ట్యాంక్‌లో కొనసాగుతున్న పనుల పురోగతి, పెండింగ్ పనుల వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.

చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌కు సంబంధించిన పెండింగ్ పనులన్నింటినీ యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని నీటిపారుదల శాఖ, HNSS కాలువల సంబంధిత అధికారులను ఆదేశించారు. ట్యాంక్‌లో పేరుకుపోయిన వ్యర్థ మొక్కలు, పిచ్చి మొక్కలను పూర్తిగా తొలగించి నీటి నిల్వకు అనుకూలంగా సిద్ధం చేయాలని సూచించారు.

అలాగే, చిప్పిలి ట్యాంక్ నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు తాత్కాలికంగా ఎత్తు పెంచే చర్యలు చేపట్టి, గత ఏడాదితో పోలిస్తే అధికంగా నీటిని నిల్వ చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.

నీరు వృథా కాకుండా షెడ్యూల్ ప్రకారం క్రమబద్ధంగా ట్యాంకులను నింపాలని, ప్రతి మున్సిపాలిటీ పరిధిలో తాగునీటి కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు స్పష్టం చేశారు.

మదనపల్లె పట్టణ ప్రజల తాగునీటి అవసరాలకే తొలి ప్రాధాన్యత

చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌లోకి చేరే HNSS నీటిని మదనపల్లె మున్సిపాలిటీ పరిధిలోని ప్రజల తాగునీటి అవసరాలకు వినియోగించడమే ప్రథమ ప్రాధాన్యతగా ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పట్టణ ప్రజలకు సురక్షితమైన, నిరంతర తాగునీటి సరఫరా అందేలా సంబంధిత శాఖలు సమన్వయంతో అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

HNSS నీరు ట్యాంక్‌కు చేరే సమయానికి ఎటువంటి సాంకేతిక, నిర్వహణపరమైన సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. నీటి నిల్వ, శుద్ధి, మదనపల్లె పట్టణానికి తాగునీటి సరఫరాకు సంబంధించిన ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఇరిగేషన్ ఎస్సీ వెంకట్రామయ్య, హంద్రీ–నీవా సుజల స్రవంతి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వైరల్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *