మదనపల్లె, ఆగస్టు 2: మదనపల్లె పట్టణంలోని నీరుగట్టువరిపల్లె మాయాబజార్లో జే పి తేక్వొందో అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ పోటీలు ఆదివారం ఉత్సాహంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ప్రోత్సహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చిన్నారుల్లో క్రమశిక్షణ, ఆత్మరక్షణ నైపుణ్యాలు, శారీరక దృఢత్వాన్ని పెంపొందించడంలో మార్షల్ ఆర్ట్స్ కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. విద్యతో పాటు ప్రతి విద్యార్థి కనీసం ఒక క్రీడలో ప్రావీణ్యం సాధించాలని సూచించారు. క్రీడలు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే కాకుండా నాయకత్వ లక్షణాలు, సమయపాలన, మానసిక ధైర్యాన్ని కూడా పెంచుతాయని పేర్కొన్నారు.
జే పి తేక్వొందో అకాడమీ ఆధ్వర్యంలో స్వర్గీయ పి. జయకుమార్ గారి తనయుడు పి. విఘ్నేశ్, అలాగే శివకుమార్, గంగరాజులు చిన్నారులకు అందిస్తున్న శిక్షణను ఆయన అభినందించారు. సమాజానికి క్రమశిక్షణ కలిగిన యువతను తీర్చిదిద్దేందుకు ఇలాంటి అకాడమీలు చేస్తున్న సేవలు ప్రశంసనీయమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో విజయ్, మోటివేషనల్ స్పీకర్ డి.జి. రామమూర్తి, బీజేపీ యువ నాయకుడు శ్రీకాంత్, అకాడమీ శిక్షకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
:::writing
