మదనపల్లి: సీటీఎం రోడ్డు నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతోందని, ఆటో ప్రమాదంలో నవాజ్ భాష మృతి చెందిన ఘటనను రాజకీయంగా ఉపయోగించుకుంటూ కూటమి ప్రభుత్వంపై, ఎమ్మెల్యే షాజహాన్ భాషాపై వైసీపీ కౌన్సిలర్ షమీం అస్లాం చేస్తున్న ఆరోపణలు హాస్యాస్పదమని తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రంగా విమర్శించారు.
మదనపల్లిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మైనార్టీ రాష్ట్ర నాయకులు ఎస్.ఏ. మస్తాన్, సీనియర్ నాయకులు ఎస్.ఎం. రఫీ మాట్లాడుతూ.. వాస్తవాలు తెలుసుకోకుండా నిరాధార ఆరోపణలు చేయడం తగదని హితవు పలికారు.
ఐదు పర్యాయాలు కౌన్సిలర్‌గా పనిచేసిన షమీం అస్లాంకు సీటీఎం రోడ్డు నిర్మాణ పనులు ఎవరు చేపడుతున్నారు? నిర్మాణ వ్యయం ఎంత? అనే విషయాలు కూడా తెలియకపోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. సొంత వార్డులో అభివృద్ధి పనులు చేపట్టలేని వారు కూటమి ప్రభుత్వ అభివృద్ధిని విమర్శించడం హాస్యాస్పదమన్నారు.
గత వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా రహదారులు గుంతలమయంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వందల కోట్ల రూపాయలతో రాష్ట్రవ్యాప్తంగా రహదారి నిర్మాణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు.
అభివృద్ధి, సంక్షేమం, రాష్ట్ర ప్రగతి గురించి మాట్లాడే నైతిక అర్హత వైసీపీ నాయకులకు లేదని విమర్శించారు. ఎమ్మెల్యే షాజహాన్ భాషా ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడిని పరామర్శించి, ఆర్థికంగా ఆదుకునే ప్రయత్నం చేయని వైసీపీ నాయకులు టీడీపీ నేతలను విమర్శించడం విడ్డూరమని ఎద్దేవా చేశారు. ఇకనైనా వ్యక్తిగత ఆరోపణలు మానుకుని వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని సూచించారు.
ఈ సమావేశంలో టీడీపీ నాయకులు దాదు, భారతీయ నాయుడు, నాగమణి, కౌన్సిలర్ కవిత, నవీన్ చౌదరి, సోనియా తదితరులు పాల్గొన్నారు.
