మదనపల్లె: సెప్టెంబర్ 7 మదనపల్లె సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్–ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగం ఆధ్వర్యంలో “లాజిస్టిక్ రిగ్రెషన్: ఆధునిక మెషిన్ లెర్నింగ్ యొక్క నిర్మాణ అంశాలు” అనే అంశంపై ప్రత్యేక అతిథి ఉపన్యాస కార్యక్రమం నిర్వహించారు.

కార్యక్రమానికి జర్మనీలోని రుహర్ యూనివర్సిటీ బోచుమ్ ICAMS విభాగంలో మెటీరియల్స్ సైంటిస్ట్, పోస్ట్‌డాక్టోరల్ రీసెర్చ్ సైంటిస్ట్‌గా పనిచేస్తున్న డాక్టర్ పి. శ్వేత ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ పి. శ్వేత మాట్లాడుతూ.. డేటాను వివిధ వర్గాలుగా గుర్తించేందుకు లాజిస్టిక్ రిగ్రెషన్ సులభమైన, సమర్థవంతమైన మెషిన్ లెర్నింగ్ పద్ధతి అని వివరించారు. మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, మెటీరియల్స్ ఇన్ఫర్మాటిక్స్, మోడలింగ్, సిమ్యులేషన్ వంటి ఆధునిక ఏఐ రంగాల్లో మెషిన్ లెర్నింగ్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు.

డేటాను ముందుగా సరిచేయడం, అవసరమైన సమాచారాన్ని ఎంపిక చేసుకోవడం, మోడల్‌కు శిక్షణ ఇవ్వడం, ఫలితాలను అంచనా వేయడం, మోడల్ పనితీరును పరిశీలించడం వంటి అంశాలను విద్యార్థులకు వాస్తవ ఉదాహరణలతో వివరించారు. ఈ-మెయిల్ స్పామ్ గుర్తింపు, వైద్య నిర్ధారణ, క్రెడిట్ రిస్క్ అంచనా, కస్టమర్ ప్రవర్తన విశ్లేషణ, భావ విశ్లేషణ, పారిశ్రామిక నాణ్యత నియంత్రణ వంటి అనేక రంగాల్లో లాజిస్టిక్ రిగ్రెషన్‌ను ఉపయోగించవచ్చని తెలిపారు.
విద్యార్థులు ఏఐ, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ రంగాల్లో అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలకు అనుగుణంగా ప్రోగ్రామింగ్, డేటా అనాలిసిస్, ప్రాబ్లమ్ సాల్వింగ్, మోడల్ బిల్డింగ్, పరిశోధనా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. పరిశ్రమ అవసరాలతో పాటు ఉన్నత విద్య, అంతర్జాతీయ పరిశోధనా అవకాశాలను దృష్టిలో ఉంచుకుని తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని అన్నారు.
కార్యక్రమంలో మిట్స్ యూనివర్సిటీ ప్రిన్సిపాల్ డాక్టర్ పి. రామనాథన్, విభాగాధిపతి డాక్టర్ ఆర్. కల్పనా, కోఆర్డినేటర్ డాక్టర్ కె. హేమలత, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
