మిట్స్‌లో ఎంబీఏ, ఎంసీఏ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభం

టెక్నాలజీపై అవగాహనతో పాటు స్టార్టప్ ఆలోచనలను ఆచరణలో పెట్టాలి : జగన్ మోహన్ గుడ్లూరు

మదనపల్లె: సెప్టెంబర్ 7 మదనపల్లె సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరానికి గాను ఎంబీఏ, ఎంసీఏ మొదటి సంవత్సరం విద్యార్థులకు తరగతులు సోమవారం ప్రారంభమయ్యాయి.

ఈ కార్యక్రమానికి గుండ్లూరు ఇండస్ట్రీస్, తిరుపతి సీఈఓ జగన్ మోహన్ గుడ్లూరు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యూనివర్సిటీ ప్రో-చాన్సలర్ ఎన్. ద్వారకానాథ్, రిజిస్ట్రార్ డాక్టర్ ప్రదీప్ కుమార్, ఎంబీఏ విభాగాధిపతి డాక్టర్ భానుశ్రీ రెడ్డి, ఎంసీఏ విభాగాధిపతి డాక్టర్ నవీన్ కుమార్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథి జగన్ మోహన్ గుడ్లూరు మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ, నూతన ఆవిష్కరణలు, మారుతున్న పరిశ్రమ అవసరాలపై విద్యార్థులు నిరంతరం అవగాహన పెంచుకోవాలని సూచించారు.

బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తిచేసుకుని ఎంబీఏ, ఎంసీఏ వంటి పోస్ట్‌గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చేరిన విద్యార్థులు భవిష్యత్తులో వ్యాపారవేత్తలుగా, నిపుణులుగా ఎదగాలంటే కేవలం కోర్సు చదవడం మాత్రమే సరిపోదని అన్నారు. క్రిటికల్ థింకింగ్, సమస్యలను విశ్లేషించే సామర్థ్యం, నిర్ణయాలు తీసుకునే నైపుణ్యం, కమ్యూనికేషన్ స్కిల్స్, టీమ్ వర్క్, నాయకత్వ లక్షణాలతో పాటు టెక్నాలజీపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.

విద్యార్థులకు వచ్చే మంచి ఆలోచనలను కేవలం ఆలోచనలుగానే పరిమితం చేయకుండా వాటిని స్టార్టప్‌లు, ఉత్పత్తులు, మార్కెట్‌కు ఉపయోగపడే పరిష్కారాలుగా మార్చే దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. స్టార్టప్‌లను ప్రారంభించేందుకు అవసరమైన వనరులు, నిధులు, సాంకేతిక పరిజ్ఞానం, మెంటార్ల మార్గదర్శకత్వం, పరిశ్రమలతో అనుసంధానాలను సద్వినియోగం చేసుకునే సామర్థ్యాన్ని విద్యార్థులు పెంపొందించుకోవాలని తెలిపారు.

నాణ్యమైన విద్యకు మిట్స్‌లో విస్తృత అవకాశాలు

యూనివర్సిటీ ప్రో-చాన్సలర్ ఎన్. ద్వారకానాథ్ మాట్లాడుతూ.. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి మిట్స్‌లో నాణ్యమైన విద్యను అందించే అనుభవజ్ఞులైన అధ్యాపకులు, ఆధునిక మౌలిక వసతులు, అధునాతన ప్రయోగశాలలు, సమృద్ధిగా ఉన్న లైబ్రరీ వంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

విద్యార్థులు అధ్యాపకుల మార్గదర్శకత్వాన్ని సద్వినియోగం చేసుకుంటూ పరిశోధన, ఆవిష్కరణలపై దృష్టి సారించాలని సూచించారు. తమ ప్రతిభను నిరూపించుకుని ఉన్నత స్థాయికి ఎదగడానికి మిట్స్‌లో అనేక అవకాశాలు ఉన్నాయని, వాటిని గుర్తించి క్రమశిక్షణ, పట్టుదలతో లక్ష్య సాధనకు కృషి చేయాలని తెలిపారు.

కార్యక్రమంలో డైరెక్టర్–అడ్మిషన్స్ డాక్టర్ దీపాంకర్ రాయ్, అధ్యాపకులు, ఎంబీఏ, ఎంసీఏ మొదటి సంవత్సరం విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *