కోట్లు విలువైన భూముల వ్యవహారంపై కోర్టు ఆదేశాలతో తనిఖీలు.. 50 రకాల ఆస్తి పత్రాలు, 15 ఖాళీ బాండ్ పేపర్లు స్వాధీనం
అన్నమయ్య జిల్లా, మదనపల్లె: మదనపల్లి పట్టణంలో ‘లేడీ డాన్’గా ప్రచారంలో ఉన్న కోనేటి సులోచన ఇంట్లో పోలీసులు మెరుపు సోదాలు నిర్వహించారు. కోట్లు విలువైన భూముల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై బాధితుడు మార్పు వెంకటేష్ నాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోర్టు ఆదేశాలతో ఈ తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
మదనపల్లి డీఎస్పీ బుచ్చిరాజు ఆధ్వర్యంలో సీఐలు మోహన్ కుమార్, రాజారెడ్డి, మహమ్మద్ రఫీ నేతృత్వంలో మూడు ప్రత్యేక బృందాలు సోదాల్లో పాల్గొన్నాయి. సులోచన నివాసంతో పాటు ఆమె సోదరుడు శ్రీనివాసులు ఇంట్లోనూ పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.
50 రకాల ఆస్తి పత్రాలు స్వాధీనం
సోదాల్లో సుమారు 50 రకాల ఆస్తి పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. అలాగే 15 ఫోర్జరీ సంతకాలతో ఉన్న పాత ఖాళీ బాండ్ పేపర్లను గుర్తించినట్లు వెల్లడించారు.
అమాయకులకు అప్పులు ఇచ్చినట్లు నమ్మించి, వారి నుంచి ఖాళీ బాండ్ పేపర్లపై సంతకాలు తీసుకుని అనంతరం వాటిని ఉపయోగించి ఆస్తులను కాజేసేందుకు ప్రయత్నించినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు పోలీసులు పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న పత్రాలను సమగ్రంగా పరిశీలించేందుకు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపినట్లు డీఎస్పీ తెలిపారు.
భూముల వ్యవహారంపై దర్యాప్తు వేగవంతం
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అధికార ప్రభావాన్ని ఉపయోగించుకుని కోట్లు విలువైన భూముల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో ఓ మాజీ మంత్రి ముఖ్య అనుచరుడిగా చెప్పబడుతున్న కీలక వ్యక్తితో కలిసి సులోచన పనిచేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ వ్యవహారానికి సంబంధించి 2023 జూన్ 13న రిజిస్ట్రేషన్ జరిగినట్లు సమాచారం. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేసినట్లు తెలుస్తోంది.
విజయవాడలో ఉన్న సులోచన
పోలీసులు సోదాలు నిర్వహించే సమయంలో సులోచన ఇంట్లో లేరు. ప్రస్తుతం ఆమె విజయవాడలో ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. సోదాల్లో స్వాధీనం చేసుకున్న పత్రాల వివరాలను ఇంట్లో ఉన్న ఆమె పిల్లలకు పోలీసులు అందించినట్లు తెలిసింది.
బాధితుడు మార్పు వెంకటేష్ నాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోర్టు జారీ చేసిన సెర్చ్ వారెంట్ ఆధారంగా ఈ తనిఖీలు నిర్వహించినట్లు పోలీసులు వెల్లడించారు.
గతంలోనూ క్రిమినల్ కేసులు
సులోచనపై మదనపల్లి పట్టణం, మదనపల్లి తాలూకా పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఇప్పటికే 14 క్రిమినల్ కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆమెపై రౌడీషీట్ కూడా ఉన్నట్లు పేర్కొన్నారు.
సోదాల్లో స్వాధీనం చేసుకున్న పత్రాల ఫోరెన్సిక్ పరిశీలన అనంతరం భూముల వ్యవహారానికి సంబంధించిన మరిన్ని అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.
