నెట్‌వర్కింగ్ రంగంలో విస్తృత అవకాశాలు
ప్రాక్టికల్ నైపుణ్యాలతో పరిశ్రమకు సిద్ధం కావాలి: శ్యాంసంగ్ ఆర్‌అండ్‌డీ ఆర్కిటెక్ట్ కొప్పెర్ల రంజిత్ కుమార్
మదనపల్లె, ఆగస్టు 29: (gtvmedia)కంప్యూటర్ నెట్‌వర్క్స్ కేవలం పాఠ్యాంశం మాత్రమే కాదని, ఆధునిక డిజిటల్ ప్రపంచానికి వెన్నెముకగా నిలిచే కీలక సాంకేతిక పరిజ్ఞానమని బెంగళూరులోని శ్యాంసంగ్ ఆర్‌అండ్‌డీ ఇన్‌స్టిట్యూట్ ఆర్కిటెక్ట్ కొప్పెర్ల రంజిత్ కుమార్ అన్నారు.

మదనపల్లె సమీపంలోని మదనపల్లె ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (మిట్స్) డీమ్డ్ టు బీ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (CSE) విభాగం ఆధ్వర్యంలో, కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా (CSI) సహకారంతో ‘కంప్యూటర్ నెట్‌వర్క్స్’ అంశంపై పరిశ్రమ ఆధారిత అతిథి ఉపన్యాసాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రంజిత్ కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్, వీడియో కాల్స్, సోషల్ మీడియా, క్లౌడ్ అప్లికేషన్లు, ఆన్‌లైన్ బ్యాంకింగ్ వంటి అనేక డిజిటల్ సేవల వెనుక నెట్‌వర్కింగ్ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. విద్యార్థులు తరగతి గదిలో నేర్చుకునే TCP/IP, నెట్‌వర్క్ ప్రోటోకాల్స్, రూటింగ్, టన్నెలింగ్, డేటా ట్రాన్స్‌మిషన్ వంటి అంశాలు 4G, 5G, VoLTE, క్లౌడ్ నెట్‌వర్క్స్, టెలికాం రంగాల్లో ఎలా ఉపయోగపడుతున్నాయో ఉదాహరణలతో వివరించారు.
5G సాంకేతికత విస్తరిస్తుండటంతో పాటు 6Gపై పరిశోధనలు కొనసాగుతున్న నేపథ్యంలో నెట్‌వర్కింగ్ రంగంలో విద్యార్థులకు విస్తృతమైన ఉద్యోగ, పరిశోధన అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కృత్రిమ మేధస్సు, బిగ్‌డేటా, IoT, క్లౌడ్ సేవల విస్తరణతో డేటా సెంటర్ల ప్రాధాన్యత కూడా పెరుగుతోందన్నారు.
విద్యార్థులు పాఠ్యపుస్తక పరిజ్ఞానంతో పాటు ప్రాక్టికల్ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. Wiresharkతో నెట్‌వర్క్ ట్రాఫిక్ విశ్లేషణ, GitHubలో ప్రాజెక్టుల నిర్వహణ, Socket Programming ద్వారా క్లయింట్–సర్వర్ కమ్యూనికేషన్ వంటి అంశాలపై పట్టు సాధించాలని పేర్కొన్నారు. ఓపెన్‌సోర్స్ 4G/5G ప్లాట్‌ఫారమ్‌లతో ప్రాజెక్టులు చేపట్టడం ద్వారా పరిశ్రమకు అవసరమైన సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందించుకోవచ్చన్నారు.
సాంకేతిక పరిజ్ఞానంతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, టీమ్‌వర్క్, సమస్య పరిష్కార సామర్థ్యం, నిరంతర అభ్యాసాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ఇంటర్న్‌షిప్‌లు, ప్రాక్టికల్ ప్రాజెక్టులు, పరిశ్రమల సందర్శనల ద్వారా విద్యార్థులు ఉద్యోగాలకు ముందుగానే సిద్ధం కావాలని రంజిత్ కుమార్ పేర్కొన్నారు.
కార్యక్రమంలో స్కూల్ ఆఫ్ కంప్యూటింగ్ డీన్ డాక్టర్ చంద్ర ప్రకాష్ గుప్తా, CSE విభాగాధిపతి డాక్టర్ ఎం. శ్రీదేవి, కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ ఆర్. నిత్య, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
