మదనపల్లి, ఆగస్టు 21: (gtvmedia)మదనపల్లి పట్టణంలోని నీరుగట్టువారిపల్లి నుంచి కదిరి రోడ్డు మార్గంలో రూ.2.30 కోట్ల వ్యయంతో చేపట్టిన రోడ్డు విస్తరణ పనులను ఎమ్మెల్యే షాజహాన్ భాషా శుక్రవారం పరిశీలించారు.

నీరుగట్టువారిపల్లి నుంచి అన్నమయ్య సర్కిల్ వరకు రహదారి ఇరుకుగా ఉండటంతో తరచూ వాహన ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రజల అభ్యర్థన మేరకు రోడ్డు విస్తరణకు ప్రభుత్వం రూ.2 కోట్లకు పైగా నిధులు కేటాయించింది. ఇప్పటికే భూమిపూజ నిర్వహించి పనులను ప్రారంభించగా, ప్రస్తుతం పనులు వేగంగా కొనసాగుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే షాజహాన్ భాషా స్థానిక టీడీపీ నాయకులతో కలిసి విస్తరణ పనులను పరిశీలించి, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనులు నాణ్యతా ప్రమాణాలతో, వేగవంతంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
రోడ్డు విస్తరణకు అవసరమైన ప్రాంతాల్లో ఆక్రమణలను స్వచ్ఛందంగా తొలగించి అభివృద్ధి పనులకు స్థానికులు సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. ప్రజల భద్రత, ట్రాఫిక్ సమస్యల పరిష్కారం, పట్టణ అభివృద్ధి లక్ష్యంగా చేపడుతున్న ఈ పనులకు అందరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో నీలకంఠ, ఉప్పు రామచంద్ర, కమలమర్రి కృష్ణ, కె.వి. నాగరాజు, కమలమర్రి కేశవ్, రమేష్ రెడ్డి, శ్రీనివాసుల నాయుడు, రెడ్డి రాయల్, చల్లా, మల్లికార్జున్ నాయుడు, ఎర్రబల్లి వెంకటరమణారెడ్డి తదితరులు, పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
