మదనపల్లె, జూలై 30:( gtvmedia)
మదనపల్లె మున్సిపాలిటీ పరిధిలోని బి.కే.పల్లిలో ధాత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన టైలరింగ్ శిక్షణ పూర్తి చేసిన మహిళలకు సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమం గురువారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మదనపల్లె శాసనసభ్యులు ఎం. షాజహాన్ భాష మహిళలకు సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలకు ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ధాత్రి ఫౌండేషన్ చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. నైపుణ్యాభివృద్ధి శిక్షణల ద్వారా మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించి కుటుంబ అభివృద్ధికి తోడ్పడాలని ఆకాంక్షించారు.
ధాత్రి ఫౌండేషన్ కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు అవసరమైన స్థలం కేటాయించేందుకు తన వంతు సహకారం అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో ధాత్రి ఫౌండేషన్ నిర్వాహకురాలు శ్వేత, ఫౌండేషన్ సభ్యులు, టైలరింగ్ శిక్షకులు, శిక్షణ పొందిన మహిళలు, వృద్ధులు తదితరులు పాల్గొన్నారు.
