మదనపల్లి:సెప్టెంబర్ 8 మదనపల్లె సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్) విభాగం వారు ఏఐ, అంతరిక్ష సాంకేతికతలతో వాతావరణ మార్పులు, సహజ వనరుల పర్యవేక్షణ అనే అంశంపై రెండు రోజుల సైన్స్ అకాడమీస్ వర్క్‌షాప్‌ను ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, బెంగళూరు, ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ, న్యూఢిల్లీ, నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ప్రయాగ్‌రాజ్ వారి సహకారంతో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐ ఐ ఎస్ సి బెంగళూరు, సివిల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ డాక్టర్ డి నగేష్ కుమార్, బెంగళూరు ఇస్రో సైంటిస్ట్ డాక్టర్ కందుల వి సురహ్మణ్యం మరియు తమిళనాడుకు చెందిన ఆర్ 4 ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్, బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ సుభాష్ ఆర్ కుప్పుస్వామి మరియు ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్ లు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో డాక్టర్ డి నగేష్ కుమార్ మాట్లాడుతూ, దేశంలోని రిజర్వాయర్ల నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ సాంకేతికతల ప్రాధాన్యతను వివరించారు.ఏ ఐ ఆధారిత మోడళ్ల ద్వారా వరదలు, నీటి కొరత వంటి పరిస్థితులను ముందుగానే అంచనా వేసి నీటి నిల్వ, విడుదల, సాగునీటి సరఫరా, తాగునీటి నిర్వహణ, వరద నియంత్రణ వంటి అంశాల్లో సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకోవచ్చని అన్నారు. రియల్‌టైమ్ సెన్సార్ డేటా, శాటిలైట్ సమాచారం, వాతావరణ అంచనాలను ఏఐతో అనుసంధానం చేయడం ద్వారా భవిష్యత్‌లో స్మార్ట్ వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ వ్యవస్థలను అభివృద్ధి చేయవచ్చని తెలిపారు. ఇస్రో సైంటిస్ట్ డాక్టర్ కందుల వి సుబ్రహ్మణ్యం మరియు ఆంధ్ర ప్రదేశ్, గాదంకి, ఎన్.ఏ.ఆర్.ఎల్ సైంటిస్ట్ డాక్టర్ జ్యోతి నారాయణ్ భాటే మాట్లాడుతూ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎర్త్ అబ్జర్వేషన్ మరియు క్లైమేట్ మానిటరింగ్ మధ్య ఉన్న సంబంధాన్ని వివరించారు. శాటిలైట్ చిత్రాలు, రిమోట్ సెన్సింగ్ డేటా మరియు ఇతర భౌగోళిక సమాచారాన్ని ఏఐ ఆధారిత మోడళ్లతో విశ్లేషించడం ద్వారా భూమిపై జరుగుతున్న పర్యావరణ మార్పులను వేగంగా గుర్తించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో సుబాష్ పి. కుప్పుసామి మాట్లాడుతూ, భారతదేశ అంతరిక్ష రంగంలో అభివృద్ధి చెందుతున్న అవకాశాలు, స్పేస్ బిజినెస్, అంతరిక్ష రంగంలో ఉన్నత విద్య, ఉద్యోగ మరియు కెరీర్ అవకాశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో విభాగాధిపతి డాక్టర్ ఎస్ పద్మ, కోఆర్డినేటర్స్ డాక్టర్ సంధ్య, శాయీజ్ అహమ్మద్, ఆర్ ఉష, జి.నితిన్, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.



