ఉద్యోగం సాధించిన రేణుక ఇంటికి వెళ్లి వివరాలు తెలుసుకున్న ఎమ్మెల్యే
మదనపల్లి, ఆగస్టు 21: (gtvmedia)మెగా డీఎస్సీ-2025పై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో వాస్తవాలను ప్రజలకు తెలియజేసే ప్రయత్నంలో భాగంగా మదనపల్లి ఎమ్మెల్యే ఎం. షాజహాన్ భాషా శుక్రవారం మదనపల్లి రూరల్ మండలం ఇసుకనూతిపల్లిలో పర్యటించారు. మెగా డీఎస్సీ-2025 ద్వారా సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) ఉద్యోగం సాధించిన రేణుక ఇంటికి వెళ్లి ఆమెను అభినందించారు.
ఈ సందర్భంగా ఉద్యోగం సాధించిన రేణుక తన అనుభవాన్ని ఎమ్మెల్యేతో పంచుకున్నారు. “ఈ ఉద్యోగం కోసం ఏడేళ్లుగా కష్టపడ్డాను. ఉద్యోగం సాధించేందుకు ఎవరికీ ఎలాంటి డబ్బులు ఇవ్వలేదు. మా అమ్మ కూలి పని చేస్తూ నన్ను చదివించారు. ఆమె కష్టంతో, నా పట్టుదలతో ఈ ఉద్యోగం సాధించాను” అని రేణుక తెలిపారు.
అనంతరం ఎమ్మెల్యే షాజహాన్ భాషా మాట్లాడుతూ మెగా డీఎస్సీపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయని అన్నారు. ఉద్యోగాలు సాధించిన అభ్యర్థుల ఇళ్లకు వెళ్లి వారు ఏ విధంగా ఉద్యోగాలు సాధించారో తెలుసుకోవాలని వైసీపీ నాయకులకు సూచించారు.
కష్టపడి చదివి ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు సాధించిన యువతను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆధారాలు లేకుండా అనవసర ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు.
చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ పాలనలో కష్టపడి పనిచేసిన వారికి ఫలితాలు లభిస్తున్నాయని ఎమ్మెల్యే షాజహాన్ భాషా పేర్కొన్నారు. యువతలో నమ్మకం కల్పించే విధంగా ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు చేపడుతోందని తెలిపారు.
